28, జూన్ 2010, సోమవారం

ఆత్మీయులు...


(వివిద రకాల మనుష్యులు, మనస్తత్వాలు చూసినపుడు నాకనిపించిన భావం ఇలా... )


నేను నేననువారు, నీవు నీవనువారు
వెలయుచుండిరిచట వేలవేలు,

నేను నేనేయంచు నీవేమి కాదన్న
వీరులున్ గలరయ్య వెతికి జూడ,

మనము మనమనుచు మాటలాడెడివారు
మానవమతులు యిమ్మహినగలరు,

మాటలాడగబోవ మాకేదొయగునంచు
పట్టనట్టియువారు పలువురుండు.


ఇట్టిఘనులు ఇంక ఎందరున్నను గాని
నీవు నేనె, నేనె నీవు యనుచు
అంతరమ్మెరుగని ఆత్మీయులే కద
భువిని దివిగ జేయు పుణ్యమతులు.


17, జూన్ 2010, గురువారం

శుభాకాంక్షలు


ఈ రోజు నాకు ప్రియమైన, నా చెల్లెలు పుట్టినరోజు. నా చెల్లెలికి జన్మదిన శుభాకాంక్షలతో.......

తీయని నీ జీవితమున
మాయని మమతల మధువును మది నింపగా,
హాయిని గూర్చును సతతము
ఆయుష్మాన్భవతి.. యంచు ఆశీస్సులివే.


12, జూన్ 2010, శనివారం



మా మేనకోడలు వాళ్ళ స్కూల్లో పద్యాల అంత్యాక్షరి పోటీలకు వెళ్తూ,
'ట'కారంతో మొదలయ్యే పద్యం చెప్పు మామయ్య అన్నపుడు సరదాగా చెప్పిన పద్యం.


టక్కరివేషములేయుచు
చక్కగ చదువంగ సుoత సమయము లేకన్,
మిక్కిలి భారమ్ము యనుచు
గ్రక్కున పొత్తము విడుచుట గర్హ్యమ్బగురా!