24, ఏప్రిల్ 2010, శనివారం

స్నేహం


స్నేహమ్మొక అమృతమది,

మోహాతీతపు బంధము మోదమె యిచ్చున్.

ఆహా ! అద్భుతమౌ అహ

రహమున్ వికసించెడు అతులిత సుమమే !



జగతిన మరువగలేనిది

జగములకే వెలుగునిచ్చు, జననిని మించన్

యుగములకైనను వీడని

గగనాధిక స్నేహబంధ కలిమియునొకటే.

22, ఏప్రిల్ 2010, గురువారం

అమ్మ - ఆలి


అమ్మ అనెడు మాట అవనీ తలంబున

మధురమైన పాట మల్లె తోట

అమ్మ పిదప తోడు ఆలి అమ్మగయున్న

అవని చిన్నబోవు ఆమె జూచి


* * *

దినమెటులైనను గడచును

దినమంతటి శ్రమదీర్చెడు దిక్కెవరన్నన్

మనసెరుగుచు మమతనిడుచు

అనురాగము పంచునట్టి ఆలియె ఎపుడున్

1, ఏప్రిల్ 2010, గురువారం

ప్రణతులు



ఏ పుణ్యచరణాలు చేరినయంతనే

పదునాల్గు లోకాలు పరిఢవిల్లు,

ఏ పాద ధూళి సోకినయంతనే నాదు

తనువెల్ల పులకించి తనివి తీరు,

ఏ పద పీఠము ఈ హృది నిల్పగ

ఆనంద సంద్రాన అలలు పొంగు,

ఏ పద ద్వయమును ఈ చేత తాకంగ

కరతలమ్మంతయు కాంతులీను,


అట్టి నీ పదముల కడకు చేరినయంత

సకల శుభములమర సౌఖ్యమందు

పుణ్య చరిత కొలిచి పునీతంబయ్యెద

ప్రణతులందుకొనుము పావనాంబ!