20, జులై 2010, మంగళవారం

కావ్యమగును


కావ్యమనగనేమి? కవితార్థమదియేమి?
కవుల కల్పనందు కలిమియేమి?
కల్లలెరుగనట్టి కమనీయభావాల
కదలు మాటగాదె కలిమి యనగ.
కలిమి పొందలేక కవితయై కదలాడు..
కలసి పంచుకొనగ కావ్యమగును.


7, జులై 2010, బుధవారం

చిత్రము

మిన్నుల తారక మెరయగ
కన్నుల కదలాడె మోము కమనీయమ్మై,
వీనుల విందుగ వింటిని
తేనియలూరెడు స్వరములు తీయని మదిలో.

కలదను భావము కదలగ
కలబోసెను మధురోహల కవనములెన్నో,
కలగా మిగిలెను కలయిక
కలవరమందెను హృదయము కన్నీరొల్కెన్.

చల్లని వెన్నెల చి౦దెడు
కలువలరేడైన గాని కలవర మొందున్,
నల్లని మబ్బులు క్రమ్మిన
చెలికత్తెను చేరలేక.. చిత్రము గాదే!