7, మే 2010, శుక్రవారం

మల్లె మనసు


చిన్నారి చిందించు చిరునవ్వు సిరిమల్లె
కలల కన్నెమనసు కాడ మల్లె.
లేతభావమ్ముల లేలేత పూతలు
ప్రతిఫలింప జేయు పసిడిమల్లె.

వలపు వన్నెలు చిందు వనిత మదిని పొంగు
ఊహలందు విరియు బొండు మల్లె.

తనువు తాపమునంత దరికి చేరగజేసి
దూరమ్ము చేయునే దుడుకు మల్లె.

మల్లె మనసు జూడ మమత విరియ జేయు
మమత విరియజేయు మనసు మల్లె.
మల్లెపూవు వంటి మనసు కలిగెనేని
మదిని విరియు నెపుడు మల్లె తోట.

3, మే 2010, సోమవారం

సుమిత్రా....

ఇనుడస్తాద్రికి జనుచున్

గనె నా హ్రుద్ఫలకమందు కాంతులనేవో,

తననే మించుచు వెలిగెడు

నినుగని మురిసెన్ యచ్చట, నిజము సుమిత్రా!

2, మే 2010, ఆదివారం

తప్పు-ఒప్పు


తాము చేయబోవ తప్పు కానే కాదు

ఒరులు అదియె జేయ ఒప్పు కాదు.

తప్పుఒప్పులిలను తర్కించ తరమౌనె!

విశదపరతు నేను విను సుమిత్ర!