7, జులై 2010, బుధవారం

చిత్రము

మిన్నుల తారక మెరయగ
కన్నుల కదలాడె మోము కమనీయమ్మై,
వీనుల విందుగ వింటిని
తేనియలూరెడు స్వరములు తీయని మదిలో.

కలదను భావము కదలగ
కలబోసెను మధురోహల కవనములెన్నో,
కలగా మిగిలెను కలయిక
కలవరమందెను హృదయము కన్నీరొల్కెన్.

చల్లని వెన్నెల చి౦దెడు
కలువలరేడైన గాని కలవర మొందున్,
నల్లని మబ్బులు క్రమ్మిన
చెలికత్తెను చేరలేక.. చిత్రము గాదే!

4 కామెంట్‌లు:

కంది శంకరయ్య చెప్పారు...

సుమిత్ర గారూ,
పద్యాలు బాగున్నాయి. అభినందనలు. ఒక్క విషయం .. కందంలో 2వ, 4వ పాదాలలో 3వ గణం తప్పనిసరిగా నలము ( IIII ) కాని, జగణం ( IUI ) అయి ఉండాలి.

రవి చెప్పారు...

సుమిత్ర గారు., మీ పద్యాలు చాలా అందంగా ఉన్నాయి. వచన కవితలో భావం పద్య కవితలో కొంత లుప్తమవుతుందని ఒక అపప్రథ ఉంది. మీ పద్యాలు అందుకు సమాధానం. ఇలానే వ్రాయండి. అయితే అంతా వ్రాసి కూసిని మార్పులు చేస్తే ఛందోబద్ధమవుతుంది. నేను మీ రెండవపద్యం ఇలా దిద్దుతున్నాను.

కలదను భావము కదలగ
కలిగించెను మధుర భావ కవనము లెన్నో,
కలగా మిగిలెను కలయిక
కలవరమందెను హృదయము కన్నీరొల్కెన్.

మూడవపద్యంలో చివరిపాదం చెలికత్తె అంటే బావుంటుంది.

సుమిత్ర చెప్పారు...

శంకరయ్యగారు, సూచనలకు ధన్యవాదములు.

రవిగారు, మీ అభిమానానికి, సూచనలకు ధన్యవాదాలండి.

సుమిత్ర చెప్పారు...

మీ సూచనలననుసరించి చేసిన సవరణ పరిశీలించండి.